భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో.. బంగాల్లో ఓ వ్యక్తి మరణించాడు. కరోనా లక్షణాలతో ఇటీవలే ఆస్పత్రిలో చేరిన ఆయన మృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఆయన వైరస్ వల్లే మరణించాడా? లేదా? అని తెలుసుకునే దిశగా పరీక్షలు జరుపుతున్నారు.
సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఆ వ్యక్తి.. కరోనా లక్షణాలతో శనివారమే ఆసుపత్రిలో చేరాడు. కానీ ఆ వ్యక్తికి మధుమేహం ఉన్నట్టు గుర్తించిన వైద్యులు.. అందువల్లే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
40కి చేరిన కేసులు..
కరోనా వైరస్.. భారత ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. మహమ్మారి సోకిన వారి సంఖ్య 40కు చేరింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించింది.
నిర్బంధంలో ఆ 400 మంది...
భూటాన్‌లోని ఓ అమెరికా పర్యటకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఆ వ్యక్తి ఇటీవలే అసోం నుంచి భూటాన్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అసోం ప్రభుత్వం.. రాష్ట్రంలో ఆ 76 ఏళ్ల అమెరికా పర్యటకుడిని కలిసిన దాదాపు 400 మందిని నిర్బంధించింది. వీరిలో ఇప్పటివరకు ఐదుగురికి పరీక్షలు నిర్వహించగా.. అన్ని నెగిటివ్‌గా తేలాయి.
ఇటలీ దంపతుల పరిస్థితి...
రాజస్థాన్‌లో కరోనా నేపథ్యంలో కలకలం సృష్టించిన ఇటలీ దంపతుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. మరో 10 రోజుల్లో ఆ పర్యటకుడు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని అధికారులు తెలిపారు. ఆయన భార్య ఆరోగ్యం ఇప్పటికే మెరుగుపడినట్టు స్పష్టం చేశారు వైద్యులు.
మరోవైపు గుజరాత్లో కరోనాపై అనుమానాలతో సేకరించిన 47 రక్తనమూనాలు నెగిటివ్‌గా తేలాయి. విదేశాల నుంచి వచ్చిన మొత్తం 2,107 మందిపై పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,154 మంది నిర్బంధ కాలం ఇప్పటికే ముగిసింది.
ఇదీ చూడండి:- 'కరోనాను ఎదుర్కొనేందుకు సౌకర్యాలు పెంచండి'