ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో ఓ విభిన్న కారణంతో కోర్టు మెట్లెక్కాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. తన భార్య ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లోనే ఉంటూ తనతో గడపట్లేదని.. బెదిరింపులకు పాల్పడుతోందని విడాకులు ఇప్పించాల్సింగా అర్జీ పెట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. న్యాయ ఖంద్ కాలనీలో నివాసముంటున్నాడు ఓ ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్. దిల్లీ కరోల్ బాగ్‌కు చెందిన యువతితో ఏడాది కిందట వివాహమయింది. పెళ్లి తర్వాత అంతా సజావుగానే సాగింది.
నటనా తరగతులతోనే మొదలు..
అయితే.. కొద్దిరోజుల కింద నటనా తరగతుల్లో(యాక్టింగ్ క్లాస్) చేరిందా యువకుని భార్య. ఇక అప్పటినుంచి వారి మధ్య దూరం పెరిగింది. తరగతులు ముగించుకొని ఇంటికి వచ్చినప్పటినుంచి.. సోషల్ మీడియాలోనే ఉంటోందట ఆ యువతి. ఇంకా.. టిక్ టాక్ సహా ఇతర యాప్‌లన్నీ అనుసరించేది. ఇవే అతనికి కోపం తెప్పించాయి. చాలా సార్లు గొడవలూ జరిగాయి.
ఉదయం లేచినప్పటినుంచి.. అర్ధరాత్రి వరకు సోషల్ మీడియాలోనే గడుపుతోందని అర్జీలో పేర్కొన్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఫేస్బుక్, వాట్సాప్‌లలో స్నేహితులతో చాటింగ్ చేస్తోందని చెప్పుకొచ్చాడు. ఇంతేకాదు.. ఈ విషయంలో తనకు సహకరించకపోతే భర్తపై వేధింపుల కేసు పెడతానని బెదిరించిందట ఆ యువతి.
చివరకు తట్టుకోలేక.. తీవ్రంగా కలతచెందిన ఆ యువకుడు ఘాజియాబాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయవాది దినేశ్ శర్మ ద్వారా కోర్టులో విడాకులిప్పించాలని అర్జీ పెట్టుకున్నాడు. అయితే.. అతని బాధ అర్థం చేసుకున్న న్యాయస్థానం ఇద్దరికీ నచ్చచెప్పి ప్రారంభ దశ కౌన్సెలింగ్ ఇప్పించింది. గొడవలతో సమస్య పరిష్కారం కాదని పేర్కొంది.
ఇదీ చూడండి: స్విగ్గీలో బీర్.. అడ్డంగా దొరికిపోయిన చోర్!