పశ్చిమ బంగ రాష్ట్రం పేరు 'బంగ్లా'గా మార్చే ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పేరు మార్పునకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టాలని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు దీదీ.
పేరు మార్పుపై ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదని, రాజ్యాంగ సవరణ అవసరమౌతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రకటించిన అనంతరం ఈ లేఖ రాశారు మమత.
ఆంగ్లంలో వెస్ట్ బంగాల్గా, బెంగాలీలో పశ్చిమ్ బంగగా తమ రాష్ట్రాన్ని వ్యవహరిస్తున్నారని, గొప్ప చరిత్ర కలిగిన తమ రాష్ట్రాన్ని ఈ విధమైన పేర్లు ప్రతిబింబించవని తన లేఖలో పేర్కొన్నారు దీదీ.
2017, సెప్టెంబర్ 8వ తేదిన బంగాల్ పేరును హిందీ, ఆంగ్లం, బెంగాలీ భాషల్లో బంగ్లాగా మార్చేందుకు రాష్ట్ర శాసనసభ అంగీకారం తెలిపింది. 2018, ఆగస్టు, 21న ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.
పేరు మార్పు ప్రక్రియను వేగవంతం చేయాలని బంగాల్ ప్రభుత్వం తరఫున ఓ లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను గురువారం కేంద్రానికి పంపించనున్నారు.
ఇదీ చూడండి: 120 ఏళ్ల సంప్రదాయం.. పోస్ట్ఉమెన్ పడవ ప్రయాణం