కొవిడ్-19 (కరోనా) సోకుతుందన్న భయంతో జపాన్ తీరంలో నిలిపివేసిన ఓడలోని భారతీయులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్బంధ కాలం ముగిసిన తర్వాత కిందకు దించడానికి చర్యలు చేపడుతున్నట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
నౌకలోని భారతీయులకు.. రాయబార కార్యాలయం ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉంటుందని ఈ-మెయిల్ ద్వారా వారికి సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ సోకిన నౌకలోని ముగ్గురు భారతీయులకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
"కొవిడ్-19 పరీక్షల ఫలితాలను బట్టి నిర్బంధ కాలం ముగిసిన తర్వాత భారతీయులను నౌక నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. వారి (కొవిడ్ సోకిన ముగ్గురి) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం కోలుకుంటున్నారు. నౌకలో ఉన్న భారతీయుల సంక్షేమం కోసం సంబంధిత జపాన్ అధికారులతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది."-జపాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారి
మరోవైపు కొవిడ్ పరీక్షల్లో వైరస్ లేదని తేలిన 80 ఏళ్లకు పైబడిన వారిని నౌకలో నుంచి ముందుగానే బయటకు పంపే సదుపాయం కల్పిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే నౌకలో 80 ఏళ్లకు పైబడిన భారతీయులు ఎవరూ లేరని ప్రభుత్వ నివేదిక తెలిపింది.
నౌకలో 138 మంది (132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు) భారతీయులు సహా మొత్తం 3,711 మంది ఉన్నారు. హాంకాంగ్‌లో దిగిన ఓ వ్యక్తి నుంచి నౌకలోని వారికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి నౌకను నిర్బంధంలో ఉంచారు. నౌకలో ఉన్న వారిలో ముగ్గురు భారతీయులు సహా 218 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఇద్దరు ఫేస్బుక్ రారాజులు త్వరలో కలవబోతున్నారు!