మహారాష్ట్ర, పాల్ఘర్ జిల్లా తారాపుర్ కెమికల్ జోన్లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో నందోలియా ఆర్గానిక్ కెమికల్స్ ప్రైవేటే లిమిటెడ్ పరిశ్రమలో.. భారీ పేలుడు జరిగింది. ఆ శబ్ధాలు దాదాపు 10 కి.మీ. మేర వినిపించాయి. తారాపుర్ సహా సాల్వడ్, పాస్థల్, బోయీసర్, చించానీ, నందగావ్ గ్రామాలు పేలుడు ధాటికి ప్రభావితమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.

పేలుడు సమయంలో పరిశ్రమలో పని చేస్తున్న 20 మంది కార్మికుల్లో14 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సందీప్ కుష్వాహ, గ్రిజేశ్ మౌర్య ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కంపెనీ నిర్వాహకుల్లో ఒకరైన సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం 'డిక్లోరో బెంజమైడ్ అజోల్' అనే రసాయన మిశ్రమంలో మోతాదుకు మించిన నీటిని కలపడం వల్లే.. ఈ ప్రమాదం సంభవించింది.
ఇదీ చదవండి: బయోకాన్ చీఫ్ 'కిరణ్ మజుందర్ షా'కు కరోనా