తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. సోమవారం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆయనకు, ఆయన కుటుంబానికి కలిసి మొత్తం రూ.143.26 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో రూ.76.56 కోట్లు ఆయన పేరుపై, రూ.52.44 కోట్లు సతీమణి రష్మీ ఠాక్రే పేరు మీద ఉన్నట్లు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పత్రాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి సొంత కారు లేదు.
బ్యాంకు రుణాలతో కలిపి మొత్తం రూ.15.50 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక ఆయనపై మొత్తం 23 కేసులు ఉన్నాయి. వీటిలో 14 కేసులు ఆయన శివసేన అధికారిక పత్రిక సామ్నాకు గీసిన కార్టూన్లు లేదా రాసిన వ్యాసాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నమోదైనవే.
ఉద్ధవ్ తన ఇద్దరు కుమారులు తనపై ఆధారపడుతున్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదు. దీంతో వారివురి ఆస్తులు, అప్పుల వివరాలు తెలపలేదు. సీఎంగా వేతనం, వడ్డీలు, డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్ ఉద్ధవ్ తన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. ఇక ఆయన భార్య రష్మీకి.. వడ్డీలు, అద్దె, కంపెనీ లాభాల్లో వాటా, డివిడెండ్, క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఆదాయం సమకూరుతున్నట్లు తెలిపారు.
అనేక ఆసక్తికర పరిణామాల తర్వాత సోమవారం ఉద్ధవ్ ఠాక్రే ఎంఎల్‌సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు అధికార పక్షానికి చెందిన మరో నలుగురు కూడా నామినేషన్ వేశారు. ఎలాంటి పోటీ లేకపోవడంతో ఉద్ధవ్ ఎంఎల్‌సీగా ఎన్నికవడం లాంఛనమే అవనుంది.
ఇదీ చదవండి:అదిరే 'సింగం' స్టంట్‌కు- రూ.5 వేల జరిమానా!