లాక్డౌన్ సడలింపుల తర్వాత భారత్‌లో కరోనా విజృంభిస్తోంది! పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు రెండువేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 2,345 మందికి కరోనా సోకింది. మరో 64 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 41 మంది మృతులు ఒక్క ముంబయి నగరం నుంచే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో గత ఐదు రోజుల్లోనే 10 వేల కేసులు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం బాధితుల సంఖ్య 41,642కి చేరినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1,454కు చేరింది. ఈ రోజు 1,408 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 11,726 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు స్పష్టం చేశారు.
తమిళనాడులో 776
తమిళనాడులో వరుసగా రెండో రోజూ ఏడు వందలకు పైగా వైరస్ కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 776 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 13,967కి చేరింది. మరో ఏడుగురు మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 94కి పెరిగింది. 400 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 6,282 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు స్పష్టం చేశారు.
10 వేలకు చేరువలో
గత 24 గంటల్లో గుజరాత్లో కొత్తగా 233 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 24 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ఒక్క అహ్మదాబాద్‌లోనే 17 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 619కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,449కి పెరిగాయి.
దిల్లీలో
వరుసగా మూడో రోజు దిల్లీలో 500కు పైగా వైరస్ కేసులు బయటపడ్డాయి. కొత్తగా నమోదైన 571 కేసులతో.. బాధితుల సంఖ్య 11,659కి చేరింది. దిల్లీలో ఒకరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 194కి పెరిగినట్లు స్పష్టం చేశారు.
19 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 340 కేసులు నమోదయ్యాయి. 19 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 138కి చేరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కేసులు 5,515కి ఎగబాకినట్లు స్పష్టం చేశారు.
కర్ణాటకలో 143
కర్ణాటకలో మరో 143 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,605కి చేరినట్లు వెల్లడించారు. 571 మంది డిశ్చార్జి కాగా.. 992 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 41 మంది వైరస్‌కు బలైనట్లు చెప్పారు.
గణనీయంగా పెరిగిన పరీక్షలు
గత రెండు నెలల్లో ఒక రోజుకు చేస్తున్న కరోనా పరీక్షలను వెయ్యి రెట్లు పెంచినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ప్రతీ ఒక్క పాజిటివ్ కేసుకు 20కి పైగా నెగిటివ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. మే 20వ తేదీ ఉదయం 9 గంటల వరకు దేశ వ్యాప్తంగా 25,12,388 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు చేసిన సామర్థ్యాన్ని సాధించినట్లు వివరించింది ఐసీఎంఆర్. రెండు నెలల క్రితం వరకు రోజుకు వంద కంటే తక్కువ కరోనా పరీక్షలు జరిగేవని.. ఆ సంఖ్య ఇప్పుడు లక్ష దాటిందని ఐసీఎంఆర్ తెలిపింది. జనవరి వరకు పుణెలోని జాతీయ వైరాలజీ ఇన్సిట్యూట్ మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించేదని ఇప్పుడు దేశ వ్యాప్తంగా 555 పరిశోధనాశాలలు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఐసీఎంఆర్ వివరించింది.