అక్టోబరు 24న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భాజపా-శివసేన, కాంగ్రెస్-ఎన్‌సీపీలు పొత్తుతో పోటీ చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం 145 కాగా.. 24వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఏకైన పెద్దపార్టీగా నిలిచిన భాజపాకు 105 స్థానాలు దక్కాయి. శివసేన-56, కాంగ్రెస్-44, ఎన్‌సీపీ-54 సీట్లు సాధించాయి. ఇక భాజపా, శివసేనలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు. ఈ తరుణంలో శివసేన మెలిక పెట్టింది. రాష్ట్రంలో అధికారాన్ని, సీఎం పదవిని చెరిసగం కాలం 50:50 ఫార్ములా ప్రకారం పంచుకుందామంటూ గట్టిగా పట్టుబట్టింది.
కొత్త పొత్తులు
అయితే '50:50'కు భాజపా ససేమిరా అన్నందున పీటముడి బిగుసుకుపోయింది. మరోవైపు కాంగ్రెస్, ఎన్‌సీపీలు ప్రతిపక్షంలోనే కూర్చుంటాయని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సహా ఆయా పార్టీల నేతలు తేల్చేశారు. ఈ దశలో శరద్ పవార్ ప్రకటన అనంతరం శివసేన కొంత మెత్తబడినట్లు కనిపించింది. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా భాజపాతోనే ఉండాల్సిన అవసరం ఉందంటూ ప్రకటించింది. 50:50పై పట్టు మాత్రం వీడలేదు. అదే సమయంలో శరద్ పవార్‌తో, శివసేన నేత రౌత్ భేటీ అయినందున కొత్త 'పొత్తు'లపై ప్రచారం ఊపందుకుంది.
ఈ పరిస్థితుల్లోనే శరద్ పవార్‌తో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఫోన్‌లో మాట్లాడటంతో ఒక్కసారిగా ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలన తప్పదంటూ భాజపా నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీతో దిల్లీలో శరద్ పవార్ భేటీ కాగా.. భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో దేవేంద్ర ఫడణవీస్ చర్చలు జరిపినా ఏమీ తేల్లేదు.
రాష్ట్రపతి పాలన వరకూ
మహారాష్ట్రలో అసెంబ్లీ కాలపరిమితి ఈ నెల 8వ తేదీతో ముగిసింది. సీఎం పదవికి ఫడణవీస్ రాజీనామా చేశారు. అనంతరం భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీన్ని 10న ఆ పార్టీ తిరస్కరించంటం మరింత ఉత్కంఠ పెంచింది. ఈ పరిస్థితుల్లో శివసేనను గవర్నర్ ఆహ్వానించారు. అప్పటికే ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్న సేన... కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు మరింత సమయం కావాలని కోరింది. ఆ విన్నపాన్ని గవర్నర్ తిరస్కంచి.. ఎన్‌సీపీని ఆహ్వానించారు. నవంబరు 12 వరకు గడువిచ్చారు. మూడు పార్టీల్లోనూ ఎడతెగని చర్చలు జరిగాయి. అయినా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు రాలేదు. అయితే ఎన్సీపీకిచ్చిన గడువు వరకు వేచి చూడకుండానే కేంద్రానికి గవర్నర్ నివేదిక ఇస్తూ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారురు. దీనికి వెంటనే కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం రాష్ట్రపతి పచ్చజెండా ఊపడం జరిగిపోయింది.
మోదీతో శరద్ భేటీ
ఈ దశలో శివసేన పగ్గాలు చేపట్టే దిశగా ఈనెల 15 నుంచి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. శరద్ పవార్‌తో కాంగ్రెస్ చర్చల అనంతరం శివసేనతో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. రెండు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని 21న శివసేన తెలిపింది. తర్వాతి రోజు జోరుగా చర్చలు జరిగాయి. అయితే ఈ మధ్యలో ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై మోదీతో పవార్ చర్చించినట్లు ఎన్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. చివరకు మహా వికాస్ అఘాడిగా ఏర్పడిన మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వచ్చాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.
మళ్లీ భాజపా హస్తవాటం
ఇక కథ సుఖాంతం అనుకుంటున్న దశలో భాజపా తెరవెనక జరిపిన మంతనాలతో మహారాష్ట్రలో రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా భాజపాకి మద్దతు తెలిపారు. దీంతో ఉదయం 5.47 గంటలకు మహారాష్ట్రలో రాష్ట్రపత్తి పాలన ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామాలు శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. అజిత్ పవార్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శరద్ పవార్ మాత్రం తమ మద్దతు శివసేనకే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా అజిత్ పవార్‌ను ఎన్‌సీపీ శాసనసభా పక్ష నేతగా తొలగించారు.
సుప్రీం వద్దకు..
అలాగే.. భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. విశ్వాస పరీక్షపై వెంటనే ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్, ఫడణవీస్ లేఖలను ముందుగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోవైపు మహారాష్ట్రలోని పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
ఈ దశలోనే ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో మహా వికాస్ అఘాడి బలప్రదర్శనకు దిగింది. తమ వెంట 162 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో 27వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పు తరువాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మరిపోయాయి. సుప్రీం తీర్పును శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఇదిలా ఉంటే సుప్రీం తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికీ రాజీనామా చేశారు. ఆ తర్వాత సీఎం ఫఢణవీస్ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పోడిచిందని విమర్శించారు.