మహారాష్ట్రలో.. బీమా కింద ఓ కంపెనీ అమరావతి జిల్లా రైతుకు 4.35 రూపాయలు చెల్లించింది. దీనితో ఆ రైతు తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. మోసపోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఆశలు పెట్టుకుని...
70ఏళ్ల సాహెబ్రావ్ ధాలే రిధ్పుర్ గ్రామవాసి. ఆయనకు 5 ఎకరాల పొలం ఉంది. 2019లో రెండు పంటలు(పత్తి, సోయాబీన్) వేశాడు. వీటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ. 900 చెల్లించి బీమా తీసుకున్నాడు.
అయితే గతేడాది మహారాష్ట్రను అకాల వర్షాలు కుదిపేశాయి. వేలాది ఎకరాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పంట చేతికందకపోవడం వల్ల.. ఆశలన్నీ బీమా మీదే పెట్టుకున్నాడు. కానీ ఆ కంపెనీ మాత్రం రైతుకు రూ. 4.35 ఇచ్చి పంపించింది. బీమా సంస్థ తనను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సాహెబ్రావ్.
ఈ ఘటనపై జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ ఛాహ్లే స్పందించారు.
"పంట నష్టానికి సంబంధించి బీమా ప్రకటించినప్పటికీ.. మిగిలిన సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విషయం తెలియక రైతులు ఆందోళన పడుతున్నారు. అందరికీ బీమా కింద కనీసం రూ. 1000 అందుతుంది."
--- విజయ్ ఛాహ్లే, జిల్లా వ్యవసాయాధికారి.
రైతులకు నష్టం జరుగుతోందని రాష్ట్ర మాజీ వ్యవసాయమంత్రి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.