ఓటమి భయంతోనే మహాకూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతల ఎన్నికల్లో భాజపా వెనుకంజలో ఉందని ఆయన మాటల్లో స్పష్టమవుతుందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడారు అఖిలేశ్. ప్రధాని ఎవరు అవుతారో మహాకూటమే నిర్ణయిస్తుందని జోస్యం చెప్పారు. యూపీలో కూటమికే అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
"ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో, ప్రధాని ఎవరు అవుతారో మహాకూటమి పార్టీలే నిర్ణయిస్తాయి. మోదీ 180 డిగ్రీ ప్రధాని. ఆయన చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండదు. మోదీ కేవలం ఒక్క శాతం మందికే ప్రధాని. అందుకే సామాజిక న్యాయం కోరుకునే పార్టీలు దేశాన్ని ముందుకు నడిపించడాన్ని మోదీ సహించలేకపోతున్నారు. అధికారంలోకి రాలేరని తెలిసే సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తున్నారు. ఎన్నికలు ప్రారంభమై నియమావళి అమల్లోకి వచ్చాక కూడా దాడులు జరగడం చరిత్రలో ఎన్నడూ జరగలేదు."
-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు.
ఇదీ చూడండి: కేజ్రీవాల్‌పై దాడికి కారణం అదేనట!