ఏకాగ్రతతో కారు నడపాల్సిన ఉబెర్ డ్రైవర్.. ఫోన్లో మాట్లాడుతూ, నిద్రపోతూ ఓ ప్రయాణికురాలిని అసహనానికి గురిచేశాడు. అతని ప్రవర్తన ఎంతకీ మారనందున చేసేది లేక వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ చివరకు ఆ ప్రయాణికురాలే కారు నడిపి గమ్యస్థానానికి చేరుకుంది. అదే సమయంలో కారు డ్రైవర్ హాయిగా సేద తీరుతూ కనిపించాడు. ముంబయిలో ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ ప్రవర్తనతో ఆశ్చర్యానికి గురైన ఆ మహిళ.. వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
ఏం జరిగింది
తేజస్విని దివ్య నాయక్ (28) అనే మహిళ ఫిబ్రవరి 21న పుణె నుంచి ముంబయిలోని తన ఇంటికి వెళ్లేందుకు మధ్యాహ్నం 1 గంటకు ఉబెర్ కారు బుక్ చేసుకుంది. ఆమెను కారులో ఎక్కించుకున్న డ్రైవర్ కాస్త దూరం వెళ్లే సరికి నిద్రలోకి జారుకున్నాడు. అది గమనించిన దివ్య అతన్ని కాసేపు నిద్రపోమని చెప్పి తాను డ్రైవింగ్ చేసింది. అయితే తాను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చోదకుడు నిద్ర పోకుండా ఫోన్లో మాట్లాడాడని ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడని చెప్పింది దివ్య. ఇంకో అర్ధగంటలో తాను చేరుకోవల్సిన ప్రాంతం రానుంది అనగా అప్పుడు డ్రైవర్ మేల్కొన్నాడని స్పష్టం చేసింది.
" కారు ఎక్కినప్పటి నుంచి డ్రైవర్ అదే పనిగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. అది గమనించిన నేను డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడొద్దని చెప్పా. ఫోన్ మాట్లాడటం ఆపేసిన డ్రైవర్ తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. ఒకానొక సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టబోయాడు. దీంతో నాకు భయం వేసి నేను డ్రైవింగ్ చేస్తా అని చెప్పి అతన్ని కాసేపు పడుకోమన్నా. నాకు వెన్నెముక సమస్య ఉండడం వల్ల ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయలేక కాస్త ఇబ్బంది పడ్డా."
--- తేజస్విని దివ్య నాయక్, ప్రయాణికురాలు
చోదకుడు నిద్రలో ఉండగా తేజస్విని దివ్య వీడియో, ఫొటోలు తీసింది. వాటిని ఉబెర్ సంస్థకు ట్యాగ్ చేసింది. స్పందించిన ఉబెర్ సంస్థ అధికార ప్రతినిధి ఈ ఘటన చాలా బాధాకరమని, ఆ డ్రైవర్ను వెంటనే సస్పెండ్ చేస్తున్నామని ఈ-మెయిల్ ద్వారా సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి: మధ్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం.. పార్టీల మాటల యుద్ధం