మహారాష్ట్రలో భాజపా-శివసేనల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. నవంబర్7 నాటికి ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించవచ్చంటూ భాజపా నేత, రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటీవార్ చేసిన వ్యాఖ్యలను సేన తిప్పికొట్టింది. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్రపతి ఏమైనా మీ(భాజపా) జేబులో ఉన్నారా..? అంటూ తన అధికార పత్రిక సామ్నాలో ప్రశ్నించింది.
రాష్ట్రపతి పాలన వ్యాఖ్యల నేపథ్యంలో ముంగంటీవార్పై ఎదురుదాడికి దిగింది సేన. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.
"ముంగంటీవార్ ప్రేరేపించిన ముప్పు నుంచి సామాన్య ప్రజలు తప్పించుకోవటానికి ఏం చేయాలి? భారత రాష్ట్రపతి.. భాజపా జేబులో ఉన్నారు అని దాని అర్థమా లేదా మహారాష్ట్ర భాజపా కార్యాలయంలో రాష్ట్రపతి ముద్ర ఉందా? భాజపా.. ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో ఆ ముద్రతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని వీరు వెల్లడిస్తున్నారా? సంఖ్యాబలానికి సంబంధం లేకుండా తాము మాత్రమే పాలన చేస్తామనే రీతిలో ముంగంటీవార్ వైఖరి ఉంది. రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడేవారు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలి."
- శివసేన
తిప్పికొట్టిన ముంగంటీవార్...
అయితే.. రాష్ట్రపతి పాలన వ్యాఖ్యలను శివసేన తప్పుగా ఆపాదించుకుందని పేర్కొన్నారు ముంగంటీవార్. నిర్ణీత సమయంలోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఏం జరుగుతుందో అని అడిగినప్పుడు.. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలన వస్తుందని సమాధానమిచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు సమాధానమిస్తే.. అది హెచ్చరికలా భావించాలా అని ప్రశ్నించారు.
అక్టోబర్ 24న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత చెరిసగం పాలన (50:50 ఫార్మలా)పై పట్టు వీడట్లేదు శివసేన. ఇరు పార్టీల మధ్య అవగాహన కుదరకపోవటం వల్ల ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది.
ఇదీ చూడండి: 'భారత్ ప్రయోజనాల మేరకే ఆర్సీఈపీలో చేరిక'