మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులకు ఆశ్చర్యకర కేసు ఎదురయింది. ఇనుము తదితర వస్తువులు మింగి అనారోగ్యానికి గురయిన యోగిత్ సింగ్ అనే ముప్పై ఏళ్ల యువకుడు ఆసుపత్రిలో చేరాడు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి వస్తువులను బయటకు తీశారు. అందులో పెన్ను, పెన్సిల్, ఇనుప ముక్కలు, రబ్బరు ముక్కల వంటివి సుమారు 33 వస్తువులు బయటపడ్డాయి. వాటిని చూసి వైద్యులే ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
జిల్లాలోని ఇషానగర్లో నివసించే యోగిత్ సింగ్‌కు కొద్ది రోజుల క్రితం కడుపునొప్పి సమస్య ఏర్పడింది. అప్పుడు తాను ఇనుప ముక్కలు తిన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. కానీ మొదట వారు నమ్మలేదు. దగ్గర్లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించగా అది స్పష్టమైంది.
చికిత్స కోసం బుందేల్‌ఖండ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసిన వైద్యులు యువకుడి పొట్ట నుంచి వస్తువులను తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది ఇలా ఉంటారని, ఇది ఒక రకమైన మానసిక స్థితి మాత్రమే కానీ పిచ్చి కాదని వైద్యులు వెల్లడించారు.
" యువకుడు పలు రకాల వస్తువులు మింగాడు. అందులో పెన్ను, పెన్సిల్, ఇనుప ముక్కలు ఉన్నాయి. అవి తినడానికి అతని మానసిక స్థితి కారణం. ఛతర్‌పుర్‌లో ఇలాంటి కేసు నా కెరీర్లోనే మొదటిసారి వచ్చింది. వస్తువులను పొట్ట నుంచి బయటకు తీసినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాం. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉంది."
- ఆసుపత్రి వైద్యుడు.