మధ్యప్రదేశ్‌లో రేపే కమల్‌నాథ్ సర్కార్ భవితవ్యం తేలనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజే (మార్చి 16) తన (గవర్నర్) ప్రసంగం పూర్తి అయిన వెంటనే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్లు మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ తెలిపారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
"22 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామాలు పంపారని, వారు ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల ద్వారా తెలియజేసినట్లు నాకు తెలిసింది. మీడియా కవరేజీని నేను శ్రద్ధగా గమనించాను."- లాల్జీ టాండన్, మధ్యప్రదేశ్ గవర్నర్ (ముఖ్యమంత్రికి రాసిన లేఖలో)
కాంగ్రెస్ విప్ జారీ
మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. బడ్జెట్ సెషన్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ విప్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డా. గోవింద్ సింగ్.. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ సభ్యులందరూ కచ్చితంగా హాజరవ్వాలని ఆదేశించారు.
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను కాదని భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వం దినదిన గండంగా నడుస్తోంది.
రాజీనామాలకు ఆమోదం
మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి... ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. వీరంతా కమల్‌నాథ్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసినవారే.
"ఇమారతి దేవి, తులసీ సీలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మహేంద్ర సింగ్ సిసోడియా, ప్రద్యుమ్న్ సింగ్ తోమర్, ప్రభురామ్ చౌదరిల రాజీనామాలను ఆమోదించాను."- ప్రజాపతి, మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్
స్పీకర్ తాజా నిర్ణయంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 222కి చేరింది. మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
ప్రత్యేక పూజలు
కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు దేవాలయాలను జోరుగా సందర్శిస్తున్నారు. రాజస్థాన్ జైపూర్‌లోని ప్రసిద్ధ ఖుతుష్యమ్ ఆలయంతో సహా పలు ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేస్తున్నారు.
దీనికి విరుగుడుగా రాష్ట్రమంత్రి పీసీ శర్మ... అగర్ మాల్వా జిల్లాలోని ప్రసిద్ధ బాగ్లాముఖి ఆలయంలో అగ్నికర్మ నిర్వహించారు. కాంగ్రెస్‌లో సంక్షోభం లేదని ఆయన స్పష్టం చేశారు. బాగ్లాముఖి ఆలయం 'తాంత్రిక' (క్షుద్ర) ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం 'హవాన్' (అగ్ని కర్మ) చేస్తారు.
ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కోవాలంటే.. ఆ 30రోజులే కీలకం.?