ఆధార్, ఇతర చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆధార్ చట్టం 2016, మనీ లాండరింగ్ చట్టం 2005, భారతీయ టెలిగ్రాఫ్ చట్టం 1885 లలో సవరణలు చేయడానికి వీలుగా ఈ బిల్లును రూపొందించారు.
ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే ఆధార్ సంఖ్య కలిగి ఉన్న వ్యక్తి అనుమతితో ఆధార్ సంఖ్యను భౌతికంగా, ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరణకు ఉపయోగించుకోవచ్చు. ఆధార్ సంఖ్య కలిగి ఉన్న చిన్న పిల్లలు, 18 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత వారి ఆధార్ సంఖ్యను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.
రూ.1.41 లక్షల కోట్లు ఆదా...
ఆధార్ కార్డు ద్వారా లబ్ధిదారులకు నేరుగా పథకాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి లక్షా 41 వేల కోట్లు రూపాయలు ఆదా అయ్యాయని బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. దేశంలో మొత్తం 130 కోట్ల మందికిగాను 123 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయన్నారు. ఇప్పటికే 69.38 కోట్ల మొబైల్ నంబర్‌లు, 65.91 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయి ఉన్నాయని వివరించారు.
బ్యాంక్ ఖాతా తెరిచేందుకు, మొబైల్ నంబర్ పొందేందుకు నచ్చితేనే ఆధార్‌ను ఉపయోగించుకునే వీలుకలుగుతుంది. సమాచార గోప్యత, భద్రతపరమైన ఆందోళనలతో సవరణలు చేశామని, ఆధార్ లేకపోతే సేవలను, పథకాల లబ్ధిని నిరాకరించబోమని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ప్రైవేటు సంస్థలు ఆధార్ సమాచారాన్ని అక్రమంగా భద్రపరిస్తే కోటి రూపాయల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పాక్వి కంటితుడుపు చర్యలు'