దేశీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ సీట్లకు గత మే 21న ప్రభుత్వం నిర్ణయించిన కనిష్ఠ ఛార్జీలు ప్రస్తుత ప్రీమియం ఎకానమీ క్లాసు సీట్లకు కూడా వర్తిస్తాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎకానమీ క్లాసు సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ఛార్జీలు మాత్రం ప్రీమియం ఎకానమీ క్లాసు సీట్లకు వర్తించవని వివరించింది. ఈ మేరకు అక్టోబరు 5న మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దేశీయ విమానాల్లో గరిష్ఠ, కనిష్ఠ విమాన ఛార్జీలను ఏడు అంచెలుగా సవరిస్తూ మే 21న విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. ప్రయాణ దూరాన్నిబట్టి వీటిని నిర్ణయించారు. తొలుత ఆగస్టు 24 వరకు ఈ ఛార్జీలు అమలులో ఉంటాయన్నారు. ఆ తర్వాత నవంబరు 24 వరకు ఈ సదుపాయాన్ని పొడిగించారు. భారత దేశీయ విమానాల్లో 'విస్తారా' సర్వీసుల్లో మాత్రమే ప్రీమియం ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. కరోనా మహమ్మారితో 2 నెలల విరామం తర్వాత మే 25 నుంచి దేశీయ సర్వీసులు తిరుగుతున్నాయి.