దేశంలో కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు ముద్రించడం వల్ల వస్తోన్న విమర్శలపై కేంద్ర విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఈ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలో ప్రస్తావించిన నేపథ్యంలో దీనిపై ఆ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. భద్రతా చర్యల్లో భాగంగా నకిలీ పాస్‌పోర్టులను గుర్తించేందుకు ఇలా జాతీయ చిహ్నాన్ని గుర్తించినట్టు స్పష్టం చేశారు. అలాగే, ఇతర జాతీయ చిహ్నాలను రొటేషనల్ పద్ధతిలో ఉపయోగిస్తామని వెల్లడించారు.
కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన కొత్త పాస్‌పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్‌సభలో జీరో అవర్ సమయంలో లేవనెత్తారు. దీన్ని పత్రిక ప్రముఖంగా ప్రచురించిందనీ.. కమలం భాజపా గుర్తు గనక దాన్ని ప్రచారం చేసుకొనేందుకు ఇలా చేస్తోందంటూ ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణలపై విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు.
‘‘కమలం మన జాతీయ చిహ్నం. నకిలీ పాస్‌పోర్టులను గుర్తించేందుకు, భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే పాస్‌పోర్టులపై దీన్ని ముద్రించాం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) మార్గదర్శకాలకు అనుగుణంగానే భద్రతా చర్యలు చేపట్టాం. ఒక్క కమలం గుర్తే కాదు.. ఇతర జాతీయ చిహ్నాలను కూడా రొటేషనల్ పద్ధతుల్లో పాస్‌పోర్టులపై ముద్రిస్తాం. ప్రస్తుతం కమలం గుర్తు వాడాం.. వచ్చే నెలలో ఇంకొకటి. భారత్‌కు చెందిన జాతీయ పుష్పం, జాతీయ జంతువు.. ఇలా ఏదైనా కావొచ్చు’’ - రవీశ్ కుమార్, విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి
- ఇదీ చూడండి: హైవే పై ఉల్లి- ఎగబడి సంచులు నింపుకున్న జనం