పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాపడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే జేడీయూ సభ్యుడు వైద్యనాథ్ ప్రసాద్ మహతో ఇటీవల మృతి చెందగా ఆయనకు నివాళులర్పించారు స్పీకర్ ఓం బిర్లా, సభ్యులు. సంతాప సూచకంగా సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు సభాపతి.
ఫిబ్రవరి 28న మృతి చెందిన వైద్యనాథ్.. బిహార్లోని వాల్మీకినగర్ నియోజకవర్గం నుంచి దిగువసభకు ప్రాతినిధ్యం వహించారు.
దిల్లీ ఘర్షణలపై రాజ్యసభ..
సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలో చెలరేగిన ఘర్షణలపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సమయానుకూలంగా చర్చ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు సభాకార్యకలాపాలు కొనసాగించేందుకు సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు వెంకయ్య. అయితే విపక్ష సభ్యులు ఘర్షణలపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు గంటలవరకు సభను వాయిదా వేశారు ఛైర్మన్.
విపక్షాల నిరసన..
ఉభయసభలు వాయిదా పడిన నేపథ్యంలో విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. దిల్లీ ఘర్షణలపై ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరీ, శశి థరూర్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొత్తరకం కట్నం కోరిన ఐఏఎస్ అధికారి!