సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ పార్లమెంట్లో భాజపా ఎంపీ రమాదేవిపై చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా సభ్యులు ఖండించారు. ఈ విషయంపై అన్ని పార్టీలతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఓంబిర్లా స్పష్టం చేశారు.
క్షమాపణలు చెప్పాల్సిందే
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఆజంఖాన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను లోక్సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సోనియాను అన్నప్పుడు ఏంచేశారు?
మహిళలను కించపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని ఆ పార్టీ లోక్ సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అగౌరవపరిచారని భాజపాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
తగిన చర్యలు తీసుకోండి
"మహిళలను కించపరుస్తూ ఆజమ్ఖాన్ చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండిస్తుండడం ఆహ్వానించదగిన విషయం. ఆయనపై తప్పకుండా తగిన చర్యల తీసుకోవాలని స్పీకర్ను కోరుతున్నాను. అయితే అధిర్ రంజన్ వ్యాఖ్యల విషయానికొస్తే.... ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని విపక్షాలను కోరుతున్నాను.
- నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి
విరుచుకుపడిన స్మృతి
"ఆజమ్ఖాన్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా. నిన్న లోక్సభలో ఏమి జరిగిందో దేశమంతా చూసింది. ఇది కేవలం మహిళల సమస్యగా భావించవద్దు. పురుషులు సహా సభ్యులందరికీ ఇది మాయని మచ్చ. అందుకే అందరూ ఒకే గొంతుతో మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నా."
- స్మృతి ఇరాని, కేంద్ర మంత్రి
ఇదీ చూడండి: 'వాజ్పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'