సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని అఖిలపక్ష నేతలను కోరారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. ప్రజలకు జవాబుదారీగా సభ ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు స్పీకర్. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
" అన్ని పార్టీల నేతలతో చర్చించాం. వివిధ సమస్యలు, విషయాలను మా ముందుకు తీసుకొచ్చారు. ఈ సమస్యలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీతో భేటీ అయి.. పార్లమెంట్ సమావేశాల్లో ఆ సమస్యలపై చర్చిస్తాం. 17వ లోక్‌సభ తొలి సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతలు భరోసా ఇచ్చారు. 130 కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్న సభ.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. సభ సజావుగా సాగేందుకు, జవాబుదారీగా ఉండేందుకు, సానుకూల వాతావరణంలో వాదోపవాదనలు, చర్చలు జరగాలని, ప్రజల సమస్యలపై మాట్లాడేలా నేతలు వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. అందరి సహకారంతో సభను ఫలవంతంగా పూర్తి చేస్తాం"
- ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్
ప్రధాని హాజరు..
అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.
విపక్షాలకు తగినంత సమయం ఇవ్వాలి..
దేశంలో నెలకొన్న నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితులపై ఈ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ్. విపక్షాలకు తగినంత సమయం కేటాయించాలన్నారు.
డిసెంబర్ 13 వరకు..
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభమై డిసెంబర్ 13 వరకు జరగుతాయి.