సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఒకే విడతలో 26 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడి అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గాంధీనగర్ లోక్‌సభ పరిధి రనిప్ ప్రాంతంలోని ఓ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మోదీ ఓటేయనున్నారు.
భాజపా ముఖ్య నేతలంతా ఉదయమే వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌లలో ఓటేస్తారని.. పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఇక్కడి కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, సోలంకీలు మూడో దశలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా... గాంధీనగర్ భాజపా అభ్యర్థి. అంతకుముందు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన పార్టీ సీనియర్ నేత అడ్వాణీ ఖాన్పుర్, షా.. నారణ్పురాలో తమ ఓటు వేయనున్నారు.
2014 సార్వత్రికంలో గుజరాత్‌లోని 26 స్థానాలను భాజపా క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 4 కోట్ల 51 లక్షల 52 వేల 373 మంది ఓటర్లున్న రాష్ట్రంలో 371 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇదీ చూడండి: ఐదు నక్షత్రాల హోటల్ నుంచి లోక్‌పాల్ బాధ్యతలు