పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. సుదీర్ఘంగా సాగిన చర్చ తర్వాత నిర్వహించిన ఓటింగ్లో 311 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. 80 మంది సభ్యులు వ్యతిరేకించారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పార్టీలకు, సభ్యులకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. శతాబ్దాలుగా వస్తున్న... భారతీయ మానవీయ విలువలు, సంస్కృతికి ఈ బిల్లు అద్దంపడుతోందన్నారు. హోంమంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా ప్రశంసించాలన్నారు మోదీ. పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి అన్ని అంశాలను షా చక్కగా వివరించారని చెప్పారు.
ఝార్ఖండ్ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న కారణంగా బిల్లు ఆమోదం సమయంలో సభకు హాజరుకాలేకపోయారు ప్రధాని మోదీ.
సభలో వాడీవేడి వాదనలు..
పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్సభలో సభ్యుల అభ్యంతరాలకు సమాధానమిచ్చారు హోంమంత్రి అమిత్షా. బిల్లు చట్ట వ్యతిరేకం కాదన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కుకు పౌరసత్వ సవరణ బిల్లు ఎలాంటి ఆటంకం కలిగించబోదన్నారు. శరణార్థుల హక్కులను బిల్లు కాపాడుతోందని వ్యాఖ్యానించారు.
రోహింగ్యాలకు అనుమతి లేదు..
విపక్షాల ప్రశ్నలకు సమాధానంగా పలు అంశాలపై వివరణ ఇచ్చారు షా. రోహింగ్యాలకు దేశంలోకి అనుమతి లేదన్నారు. బెంగాలీ హిందువులు దేశానికి రావడం మీకు ఇష్టం లేదా అని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. ప్రతిపాదిత చట్టం ద్వారా దేశంలోని ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న అమిత్షా... దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేసి తీరతామన్నారు.