పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయించిన షెడ్యూల్ కంటే 8 రోజుల ముందుగానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మధ్యాహ్నమే నిరవధిక వాయిదా పడగా.. ఇవాళ సాయంత్రం సమావేశమైన లోక్‌సభ జీరో అవర్ తర్వాత వాయిదా పడింది. అంతకుముందు మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లును కేంద్రం దిగువసభలో ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. 10 రోజులు జరిగిన వర్షాకాల సమావేశాల్లో మొత్తం 25 బిల్లులను ఆమోదించింది లోక్‌సభ.
అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ.. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ముందే ముగించాలని అన్ని పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను వాయిదా వేశారు.
రాజ్యసభలో ఇవాళ పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రతకు సంబంధించిన మూడు కార్మిక సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. ఈ బిల్లులకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లో రాజ్యసభ 25 బిల్లులకు ఆమోదం తెలిపింది.