మధ్యప్రదేశ్‌లో సోమవారం ఏర్పాటైన శివరాజ్ సింగ్ ప్రభుత్వం.. అసెంబ్లీలో బలం నిరూపించుకుంది. నేడు శాసనసభ వేదికగా జరిగిన విశ్వాసపరీక్షలో విజయం సాధించింది. భాజపా సభ్యులతో పాటు ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌కు మద్దతు తెలుపుతూ మూజువాణి విధానంలో ఓటు వేశారు.
కాంగ్రెస్ దూరం...
బలపరీక్ష కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా శాసనసభ సమావేశానికి హాజరుకాలేదు. ఈ కారణంగా సీనియర్ భాజపా ఎమ్మెల్యే, ప్యానెల్ స్పీకర్లలో ఒకరైన జగదీశ్ దేవదా ఈ ప్రత్యేక సమావేశానికి నేతృత్వం వహించారు. బలపరీక్ష అనంతరం మార్చి 27 వరకు అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు.
కుప్పకూలిన కమల్‌నాథ్ సర్కార్
22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేసి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వారు భాజపా గూటికి చేరారు. శాసనసభలో మెజారిటీ మారిన నేపథ్యంలో.. 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో 61 ఏళ్ల శివరాజ్‌సింగ్ చౌహాన్ రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. సోమవారం రాత్రి గవర్నర్ లాల్జీ టాండన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.