దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. చుక్క లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు మందుబాబులు. బాటిళ్ల కోసం కొంతమంది ఏకంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో 2 రోజుల్లో ఇలాంటివి 4 చోరీలు జరిగినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ఎక్సైజ్ విభాగాధికారి రావు సాహెబ్ కౌర్. దొంగతనానికి గురైన సరకు విలువ లక్షల్లో ఉంటుందని, మద్యం దుకాణాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
చోరీ నెం-1:
సోమవారం రాత్రి నాగ్‌పుర్ సదర్ ప్రాంతంలోని సువిదా బార్ అండ్ రెస్టారెంట్ వద్ద రూ.1.5 లక్షల విలువైన విస్కీ, రమ్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
చోరీ నెం-2:
ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 73 వేల రూపాయలు విలువైన బాటిళ్లను దొంగతనం చేశారు. అదే ప్రాంతంలోని గాడ్జ్ నగర్లోనూ 33 బాక్సుల సరకును తీసుకొని వెళ్లారు. మరో రెండు చోట్ల బీర్లు దొంగతనం చేశారు మందుబాబులు.
చోరీ నెం-3:
నాగ్‌పుర్ నగరంలోని నందనవన్ ప్రాంతంలోనూ లక్ష రూపాయల విలువ గల విదేశీ మద్యాన్ని ఎత్తుకెళ్లారు.
చోరీ నెం-4:
ధాపేవాడా ప్రాంతంలోనూ 40 వేల రూపాయలు విలువైన మద్యాన్ని తస్కరించారు.