ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణ రణరంగాన్ని తలపిస్తోంది. ఈ ఘర్షణల్లో చాంద్బాగ్లోని ఓ మద్యం దుకాణాన్ని లూటీ చేశాయి అల్లరి మూకలు. దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.
దుకాణం నుంచి సుమారు 70 నుంచి 80 లక్షల రూపాయల విలువైన మద్యంసీసాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సీసాలను పరస్పర దాడుల్లో ఉపయోగించారని పలువురు చెబుతున్నారు.
షాపులో లూటీ విషయమై పోలీసులకు రెండు సార్లు అత్యవసర నెంబర్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించలేదని దుకాణ యజమాని తెలిపాడు. చివరికి ఠాణాకు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పాడు.
18 మంది మృతి..
ఈశాన్య దిల్లీలో పౌరసత్వ చట్టంపై జరిగిన ఆందోళనల్లో భారీ హింస చెలరేగింది. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో దిల్లీ వీధుల్లో విధ్వంసం జరిగింది. 18మంది మరణించగా.. 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.
దిల్లీలో ప్రస్తుత పరిస్థితిని జాతీయ భద్రతాసలహాదారు అజిత్ డోభాల్ సమీక్షిస్తున్నారు. అల్లర్లు జరిగిన పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ ఘర్షణల్లో 18కి చేరిన మృతుల సంఖ్య