ఆసియా చింపాంజీల్లో వయసులో పెద్దది, లిమ్కా ప్రపంచ రికార్డ్ గ్రహీత రీటా మంగళవారం మృతిచెందింది. 59 ఏళ్ల చింపాంజీ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మంగళవారం జరగాల్సిన వైల్డ్‌లైఫ్ వారోత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
1960 డిసెంబర్ 15న ఆమ్స్టర్డ్యామ్ జంతు ప్రదర్శనశాలలో జన్మించింది రీటా. 1964 ఫిబ్రవరి 27న దిల్లీ జూ పార్క్‌కు తీసుకువచ్చారు. తర్వాత 16 జనవరి 1990 న రీటాను పంజాబ్‌లోని ఎమ్సీ జూలాజికల్ పార్కుకు తరలించారు. 2006 మార్చిలో మళ్లీ దిల్లీకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ చింపాంజీ దిల్లీ జూకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రీటా చింపాంజీ గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. 2018 జులై 18 నుంచి జూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 2019 జులై 27 నుంచి రీటా సాధారణ ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేసింది. పూర్తిగా ద్రవాహారంపైనే ఆధారపడింది.
చికిత్స సమయంలో మనో ఉల్లాసానికి రీటా గదిలో టీవీ కూడా ఏర్పాటు చేశారు. మెత్తటి పరుపుతో పాటు తలగడ కూడా ఇచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ రీటా అనారోగ్యంతో పోరాడలేక మంగళవారం మధ్యాహ్నం కన్నుమూసింది.
ఇదీ చూడండి:ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" గీతానికి ఉపరాష్ట్రపతి అభినందనలు