పట్టణాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ మురుగు సమస్య తప్పడం లేదు. తేలికపాటి వర్షాలకే మురుగు పొంగి పొర్లి ఇళ్లల్లోకి చేరుతుంది. దీని వల్ల దుర్వాసన, దోమలు పెరిగి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే కర్ణాటక రామ్నగరలోని ఓ కుటుంబం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ ఇంటికి ఉన్న మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.
మురుగు సమస్య పరిష్కరించేందుకు..
కర్ణాటకలోని రామ్నగరకు చెందిన వెంకటేశ్, సుజాత దంపతులు ప్రస్తుతం మాండ్యాలో నివసిస్తున్నారు. రామ్నగరలో వీరు ఓ ఇంటిని నిర్మించి అద్దెకు ఇచ్చారు. మట్టి రోడ్డు ఉన్న ఆ ప్రాంతంలో తారు రోడ్డు నిర్మించారు. దీంతో రహదారి ఎత్తు పెరిగి ఇంట్లోకి మురుగు చేరుకునేది. దీనివల్ల ఆ కుటుంబం తీవ్ర సమస్యను ఎదుర్కొంది. చేసేదేమీ లేక ఆ ఇంటిని విక్రయించాలని నిర్ణయించారు. కానీ దానికి మనసు ఒప్పక ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఇంటినే పైకి లేపాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సాంకేతికత హరియాణాలో వినియోగించినట్టు తెలుసుకున్నారు.
ఇంటిని ఎలా పైకి లేపారంటే..!
హరియాణాలోని యమునా నగర్లో టీడీవీడీ సంస్థ ఇంటి ఎత్తును పెంచే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ ఇంటిని ఓ ప్రాంతం నుంచి మరో చోటుకు మార్చే సాంకేతికతపై కృషి చేస్తోంది. ఇందుకు పని చేసే కూలీలు కూడా హరియాణాకు చెందిన వారే. ఈ సంస్థ ఇంటిని ఒక అడుగు పెంచడానికి రూ.250 తీసుకుంటుంది. తమ ఇంటి ఎత్తు పెంచేందుకు సుజాత కుటుంబ సభ్యులు దీనికి రూ. 6 నుంచి 7 లక్షలు ఖర్చు చేశారు. టీడీవీడీ సంస్థ ఈ సాంకేతికతను ఉపయోగించి ఇప్పటికే మైసూర్లో ఓ ఇంటిని విజయవంతంగా పూర్తి చేసింది.
ఇదీ చదవండి: మాస్కుల ఉపయోగంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!