నాయకత్వ మార్పు ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయలేదని సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. ఆ లేఖ సారాంశాన్ని తప్పుగా చిత్రీకరించారని, కాంగ్రెస్ అధినాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!
కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో జితిన్ ఒకరు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ లేఖ వివాదంపై స్పందించారు.
"కాంగ్రెస్కు పునరుజ్జీవం ఎలా తీసుకురావాలన్న ఉద్దేశంతో లేఖ రాశాం. పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలని ఆకాంక్షించాం. అంతేకానీ, అధినాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పాను."
- జితిన్ ప్రసాద, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి: 'సొంతపార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటారా?'
కాంగ్రెస్ అధినాయకత్వం లక్ష్యంగా లేఖ రాశారని కొంతమంది పార్టీ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన జితిన్.. సోనియా, రాహుల్ గాంధీపై పూర్తి విశ్వాసముందని అన్నారు. తనపై కూడా వాళ్లకు నమ్మకముందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సీనియర్లపై రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్లో దుమారం!
డీసీసీ వ్యాఖ్యలపై..
సీనియర్లు రాసిన లేఖను ఉద్దేశించి లఖీంపుర్ ఖేరి డీసీసీ.. జితిన్పై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. దీనిపై స్పందించిన జితిన్.. స్థానికంగా నెలకొన్న విభేదాల కారణంగా ఇటువంటి సమస్యలు రావటం సహజమన్నారు. ప్రజాస్వామిక పార్టీలో ఇవి సాధారణమని తెలిపారు. ఈ వివాదం ముగిసిందని, పాలన పరమైన విషయాలపై దృష్టిసారించాలని సోనియానే చెప్పినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ వాదులైతే లేఖను స్వాగతిస్తారు'