అయోధ్యలో జరగనున్న భూమి పూజకు హాజరుకావొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వామపక్ష మహిళా హక్కుల కార్యకర్తల సంఘం 'నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్స్'(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) విజ్ఞప్తి చేసింది. భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్నారనే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
మతస్వేచ్ఛ హక్కు వ్యక్తిగత విషయమని, మోదీకి సైతం ఈ హక్కు వర్తిస్తుందని పేర్కొంది ఎన్ఎఫ్ఐడబ్ల్యూ. అయితే.. ప్రధానమంత్రి అన్ని మతాలకు తటస్థంగా ఉండి భారతదేశ లౌకిక విలువలను కాపాడాలని తెలిపింది.
"ఆలయ భూమి పూజ కార్యక్రమానికి అయోధ్యకు ప్రధాని వెళ్లడం ద్వారా లౌకికత్వం బలహీనపడుతుంది. సమగ్ర భారత్‌ను నిర్మించాలనే మోదీ చెబుతున్నప్పటికీ.. ఈ చర్య మెజారిటీ అజెండాను ఆమోదించే విధంగా ఉంది. ఇది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. మోదీ కేవలం వ్యక్తిగత పౌరుడు కాదు. దేశ ప్రధానమంత్రిగా, ప్రభుత్వానికి అధిపతిగా.. ఒక విశ్వాసానికి, మతానికి పక్షపాతంగా కనిపించకుండా ఉండేందుకు శ్రద్ధతీసుకోవాలి."
-నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్స్
ఇది ద్వంద్వ వైఖరే!
అన్‌లాక్ 3.0 మార్గదర్శకాల ప్రకారం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకాకూడదనే విషయాన్ని ప్రస్తావించింది ఎన్ఎఫ్ఐడబ్ల్యూ. ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కావడం.. దేశంలోని ప్రజా ప్రతినిధులు పాటిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శలు చేసింది. ఆర్థిక, వైద్య సంక్షోభాన్ని ఎదుర్కోవడమే ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండాలని అభిప్రాయపడింది.