"చాలా కాలం క్రితం నుంచే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి తయారు చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. కేవలం రాజకీయ సంకల్పం లేకనే ఇన్నాళ్లపాటు అది వెలుగుచూడలేదు" అని దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ అన్నారు. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై నిర్ణయాన్ని ఆలస్యం చేయడం నేరపూరిత చర్య అని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలు పాకిస్థాన్‌కు అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నాయని మోదీ ప్రశ్నించారు. బాలాకోట్ వైమానిక దాడికి సాక్ష్యాలు అడుగుతూ భారత సైనిక దళాల సామర్థ్యాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
అవివేక ప్రభుత్వం మాత్రమే దేశ సైనిక రహస్యాలు బయటపెడుతుందన్న కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యలపై మోదీ పరోక్ష విమర్శలు చేశారు.
"ఆయన (చిదంబరం) తనే తెలివైన వాడినని అనుకుంటున్నారు. 'ఏ-శాట్' ప్రయోగాన్ని రహస్యంగా ఉంచాలని ఆయన అన్నారు. అలా అయితే 1974లో పోఖ్రాన్ అణు ప్రయోగం గురించి ఎందుకు రహస్యంగా ఉంచలేదు. అవినీతి కేసుల్లో కోర్టుకు వెళ్లిన విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచాలని నేను అర్థం చేసుకోగలను." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి :"మోదీ నిర్ణయాలతో సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ"