భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ పరిస్థితిపై పరిశోధన కొనసాగుతూనే ఉంది. చంద్రుడి ఉపరితలంపై నిస్తేజంగా ఉన్న ల్యాండర్ విక్రమ్ ఫొటోలు తీసేందుకు... అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇటీవల మరోసారి ప్రయత్నించింది. విక్రమ్ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతం మీదుగా నాసాకు చెందిన చంద్రుడి పర్యవేక్షణ ఆర్బిటర్- ఎల్ఆర్ఓ అక్టోబరు 14న పరిభ్రమణం చేసింది. తాజా పరిభ్రమణంలోనూ ల్యాండర్ దిగిన ప్రాంతంలో చిత్రాలను తీసింది. అయితే తాజా చిత్రాల్లోనూ విక్రమ్ ఆచూకీ లభించలేదని నాసా వెల్లడించింది.
అక్టోబరు 14న ఎల్ఆర్ఓ తీసిన ఫొటోలను నిశితంగా పరిశీలించామని.. వాటిలో ల్యాండర్‌కు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని నాసా పేర్కొంది.
"నీడ ప్రాంతంలోనైనా, లేదా వెతుకుతున్న ప్రాంతానికి ఆవల అయినా విక్రమ్ ఉండవచ్చు. తక్కువ అక్షాంశం కారణంగా ఆ ప్రాంతం నీడ లేకుండా ఉండలేదు."
-జాన్ కెల్లర్, నాసా శాస్త్రవేత్త
ఇంతకుముందు సెప్టెంబర్ 17న ల్యాండర్ దిగిన ప్రాంతం మీదుగా ఎల్ఆర్ఓ పరిభ్రమించి చిత్రాలు తీసింది. అయితే ఆ చిత్రాల్లోనూ విక్రమ్‌ను కనుగొనలేకపోయారు.
ఇదీ చూడండి: తిహార్ జైలుకు సోనియా గాంధీ...!