భారత్లో రుతుపవనాలను అంచనా వేసేందుకు పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనాలు సహాయపడతాయని భారతీయ జర్మన్ పరిశోధక బృందం గుర్తించింది. అగ్ని పర్వత విస్ఫోటం తర్వాత రుతుపవనాలపై కచ్చితమైన అంచనా వేయొచ్చని చెబుతున్నారు.
వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాతావరణ పరిశీలనలు, శీతోష్ణస్థితి రికార్డులు, కంప్యూటర్ మోడల్ అనుకరణల సమాచారాన్ని మిళితం చేశామని తెలిపారు. అంతేకాకుండా కొన్నేళ్ల భూగ్రహ చరిత్రను కూడా పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు వివరించారు.
"ఒక పెద్ద అగ్నిపర్వతం విస్ఫోటం తర్వాత చిన్న కణాలు, వాయువులు స్ట్రాటో ఆవరణంలోకి చేరి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాయి. స్ట్రాటో ఆవరణలోని అగ్నిపర్వత పదార్థం సూర్యరశ్మిని భూఉపరితలం చేరుకోకుండా కొంతవరకు అడ్డుకుంటుంది. ఇలా తగ్గిన సూర్యశక్తి తదుపరి ఏడాదిలో 'ఎల్నినో' ప్రభావాన్ని పెంచుతుంది."
- ఆర్. కృష్ణన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరోలజీ
అధునాతన డేటా విశ్లేషణ ద్వారా పెద్ద అగ్నిపర్వత విస్ఫోటాల ప్రభావాన్ని గుర్తించినట్లు వెల్లడించారు కృష్ణన్. సూర్యరశ్మి తక్కువ ఉండటం వల్ల వేడి తగ్గుతుందని కృష్ణన్ వివరించారు. అందువల్ల ఉత్తర, దక్షిణార్ధ గోళాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాల మార్పులు సంభవిస్తాయి. ఇది వాతావరణంలోని అధిక స్థాయి ప్రసరణ, అవపాతం గతిని ప్రభావితం చేస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: 30 ఏళ్లపాటు సేవలందించిన నౌక ఆఖరి యాత్ర