'పౌర' నిరసనలతో దేశరాజధాని దిల్లీ అట్టుడుకుతోంది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చి పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. తొలుత ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ విధించి నిరసనకారులను అడ్డుకున్నారు పోలీసులు. కానీ ఆందోళనకారులు జంతర్‌మంతర్ వద్దకు చేరుకుని నిరసనలు తెలిపారు. జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీకి వ్యతిరేకంగా జాతీయ పతాకాలతో నినాదాలు చేశారు. ఈ తరుణంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతియుత నిరసనలు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు.
దిల్లీలో అతి తక్కువ ఉష్ణోగ్రత(7 డిగ్రీలు) నమోదైనప్పటికీ.. నిరసనకారులు చలిని లెక్కచేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టారు. నిరసనను అణచివేయడానికి కొంతమంది రాజకీయనేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
నేతల అరెస్టు
అంతకుముందు ఎర్రకోట, మండీ హౌజ్ ప్రాంతాల వైపు దూసుకెళ్లిన నిరసనకారులను పోలీసులు అడ్డగించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిరసనలకు అనుమతులు లేదంటూ.. వారిని పోలీసులు నిలువరించారు. దీనితో అక్కడకు చేరుకున్న వామపక్ష నేతలు డి రాజా, సీతారాం ఏచూరీ, నిలోత్పల్ బసు, బృందా కారత్, కాంగ్రెస్ నేతలు అజయ్ ముకేన్, సందీప్ దీక్షిత్.. సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, ఉమర్ ఖలీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఎర్రకోట వద్ద నిరసనలు చేపట్టిన వందలాది మంది విద్యార్థులను కూడా నిర్బంధించారు.
పోలీసుల చేయూత
పలువురు నిరసనకారులు పోలీసులకు గులాబీలు అందజేస్తూ శాంతి సందేశం ఇచ్చారు. పోలీసులు హింసాత్మకంగా ప్రవర్తించినా... శాంతియుతంగానే నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు సురాజ్మల్ స్టేడియం వద్ద అదుపులోకి తీసుకున్న నిరసనకారులకు పోలీసులు పండ్లు అందించారు.
నిరసనల్లో పాల్గొన్న ముస్లిం విద్యార్థులు జామియా ఇస్లామియా యూనివర్సిటీ గేట్ వద్ద నమాజు చేశారు. ముస్లింలు నమాజ్ చేస్తున్న సమయంలో వారికి ఇతర విద్యార్థులు మద్దతుగా నిలిచారు. పోలీసులు వారి వద్దకు చేరుకోకుండా చుట్టూ మానవహారం ఏర్పాటు చేశారు.
మెట్రో నిలిపివేత...
నిరసనలు తీవ్రరూపం దాల్చిన తరుణంలో రాజీవ్ చౌక్ సహా 20 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేస్తూ దిల్లీ మెట్రో రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇంటర్చేంజ్ స్టేషన్ అయిన సెంట్రల్ సెక్రెటేరియెట్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ బంద్
నిరసనల దృష్ట్యా రాజధానిలో అంతర్జాల సేవలను కొద్ది గంటలు నిలిపివేశారు సర్వీసు ప్రొవైడర్లు. అధికారుల ఆదేశాల మేరకే ఇలా చేసినట్టు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర దిల్లీ, సెంట్రల్ దిల్లీ జిల్లాలు, మండి హౌజ్, సీలంపుర్, జఫ్ఫర్బాద్, ముస్తఫాబాద్, జామియా నగర్, షాహీన్ బాఘ్, బవానా ప్రాంతాల్లో సర్వీసులను నిలిపివేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సర్వీసులను రద్దు చేసేలా దిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలతో ఎయిర్‌టెల్‌తో పాటు వొడాఫోన్-ఐడియా, జియో అంతర్జాల సేవలను నిలిపివేసినట్లు సమాచారం. ఇలా రాజధానిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
ట్రాఫిక్ జాం
తీవ్ర రూపం దాల్చిన నిరసనల కారణంగా దిల్లీ-గురుగ్రామ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వేలాది వాహనాలు రహదారిపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
విమానాలకూ ట్రాఫిక్ బెడద
నిరసనల వల్ల విమానాల రాకపోకలపైనా ప్రభావం పడింది. ఎనిమిదో నెంబర్ జాతీయ రహదారిపై ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్‌లో పైలట్లు చిక్కుకోవడం వల్ల 19 ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 16 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయ విమానాల సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు విస్తారా, ఎయిర్ఇండియా, ఇండిగోలు ప్రకటించాయి.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా పౌర 'రణం'.. నిరసనలతో దద్దరిల్లిన నగరాలు