బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. తనను హత్య చేసేందుకు మూడేళ్ల క్రితం క్షుద్రపూజలు నిర్వహించారని ఆరోపించారు. క్షుద్రపూజల మీద లాలూకు చాలా నమ్మకం ఉందని ట్వీట్ చేశారు.
"లాలూకు మూఢనమ్మకాలు ఎక్కువ. తాంత్రికుడు చెప్పాడని తెల్ల కుర్తా వేసుకోవడమే మానేశారు. అంతేకాకుండా.. తాంత్రికుడైన శంకర్ చరణ్ త్రిపాఠీని తన పార్టీ జాతీయ ప్రతినిధిగా నియమించుకున్నారు. ఈ తాంత్రికుడు.. మీర్జాపుర్‌లోని విద్యాంచల్ ధామ్ వద్ద లాలూ కోసం క్షుద్రపూజలు నిర్వహించేవారు. నన్ను చంపేందుకు మూడేళ్ల ముందు క్షుద్రపూజలు చేశారు."
-- సుశీల్ మోదీ, బిహార్ ఉపముఖ్యమంత్రి.
ప్రజలపై లాలూకు నమ్మకం లేదని.. అందుకే క్షుద్ర పూజలు, జంతు బలి, ఆత్మలకు ప్రార్థనలు చేసేవారని పేర్కొన్నారు సుశీల్. అయినప్పటికీ.. ఇంతవరకు జైలు బయటకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి- బిహార్ బరి: 'నిరుద్యోగి'పైనే అందరి గురి
2005లో ఓటమి అనంతరం ముఖ్యమంత్రి నివాసాన్ని వీడేందుకు లాలూ నెలన్నర సమయం తీసుకున్నారని గుర్తుచేశారు ఉపముఖ్యమంత్రి. అయితే ఆ ఇంట్లో తాను చేతబడికి సంబంధించిన వస్తువులను దాచినట్టు.. ఇక ఆ నివాసంలో ఎవరు నిలబడలేరని లాలూ చేప్పినట్టు సుశీల్ పేర్కొన్నారు. కానీ అదే ఇంట్లో ఉండి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 15ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించారని స్పష్టం చేశారు.
'ఆరోపణల్లో నిజం లేదు..'
సుశీల్ మోదీ ఆరోపణలను ఖండించారు ఆర్జేడీ నేత, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్. ఆయన ఆరోపణలు వింతగా, ఆసాధారణంగా ఉన్నాయని.. వాటిలో నిజం లేదని తేల్చిచెప్పారు. సుశీల్ మోదీ వంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- '9న లాలూ రిలీజ్- 10న నితీశ్‌కు ఫేర్వెల్'