పశువుల దాణా కుంభకోణంలో జైలు శిక్షననుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకు విన్నవించింది సీబీఐ. ఆయన బయటకు వస్తే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం లాలూ బెయిల్ పిటిషన్పై స్పందనను తెలియజేయాల్సిందిగా సీబీఐని కోరింది. కోర్టు ఆదేశాలపై పై విధంగా స్పందించింది. ఇప్పటికే గత 8 నెలలుగా ఆస్పత్రిలో ఉంటూ రాజకీయాలు చేశారని లాలూపై ఆరోపణలు గుప్పించింది సీబీఐ.
"పిటిషనర్ ఆస్పత్రిలో ఉండగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేకమైన వార్డును ఉపయోగించారు. అక్కడి నుంచే తన రాజకీయ కార్యకలాపాల్ని కొనసాగించారు. ఇది సందర్శకుల రిజిస్టర్ను చూస్తే అర్థమవుతుంది "-సీబీఐ
ఇప్పటివరకూ అనారోగ్యంగా ఉన్న లాలూ అకస్మాత్తుగా సంపూర్ణ ఆరోగ్యవంతుడై బెయిల్ పిటిషన్ కోరుతుండటం ఆశ్చర్యకరంగా ఉందని సీబీఐ వెల్లడించింది. ఒకేసారి రెండు బెయిల్ పిటిషన్లు నమోదు చేశారని అభ్యంతరం వ్యక్తం చేసింది సీబీఐ. ఒకటి అనారోగ్య పరిస్థితుల కారణంగా, మరొకటి పార్టీ అధ్యక్షుడిగా లోక్సభ ఎన్నికల్లో దిశానిర్దేశం చేసేందుకన్న పిటిషన్. ఈ రెండూ విరుద్ధంగా ఉండటం అనుమానస్పదంగా ఉందని, ఇది చట్టవ్యతిరేకమని అన్నారు.
పశుదాణా కుంభకోణంలో రూ. 900 కోట్లను పశు సంరక్షణ శాఖ నుంచి స్వాహా చేశారన్న ఆరోపణలతో మూడు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. లాలూ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా కారాగారంలో శిక్షననుభవిస్తున్నారు.
ఇదీ చూడండి: సొమ్ము పంపే ప్రవాసీల్లో మళ్లీ మనోళ్లే టాప్!