కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీడియా ఎంతో ప్రమాదకరమైందని, దూరంగా ఉండటమే మేలని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో సర్కారు కూలిపోతుందనే ఆశతో ఉన్న భాజపా నేతలకు మీడియా వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.
మైసూరులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు కుమారస్వామి. కూటమి విడిపోతుందని భాజపా నేతలు కొత్త సూట్లు కుట్టించుకుంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిద్ధరామయ్య మార్గనిర్దేశంలో కర్ణాటకలో సంకీర్ణ సర్కారు కొనసాగుతుందని స్పష్టంచేశారు.
మీడియా నియంత్రణకు అవసరమైతే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు కుమారస్వామి.
" ఈ మధ్య అనవసరమైన వదంతులు నిద్ర పాడుచేస్తున్నాయి. మీడియా పట్ల గౌరవం పోతోంది. ఏది ప్రసారం చేయాలి.. ఏది చేయొద్దనే అంశంపై మీడియా సంయమనం లేకుండా వ్యవహరిస్తోంది.రాజకీయ నాయకులను హాస్యనటుల్లా చూపిస్తున్నారు. మేం ఎలా కనపడుతున్నాం? టీవీ ఛానళ్లు సమాజాన్ని పాడుచేస్తున్నాయి. అందుకే మీడియా నియంత్రణకు కఠిన నిబంధనలతో కూడిన చట్టం తేవాలని యోచిస్తున్నా. మేమేం మీడియా మీద ఆధారపడట్లేదు. మేం దేవుడి దయ వల్ల ఇక్కడున్నాం. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజల కోసం పనిచేస్తాం. మా సర్కారుకు ప్రమాదమేమీ లేదు. ఛానెళ్లు లేనిపోనివన్నీ కల్పించి దుష్ప్రచారం చేస్తున్నాయి."
-కుమార స్వామి, కర్ణాటక సీఎం