కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా లౌక్డౌన్ అమలు చేస్తున్నాయి. అనుమానితుల్ని తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచిస్తున్నాయి.
అయితే... కొందరు స్వీయ నిర్బంధం నిబంధనలు ఉల్లంఘించి, బయటకు వస్తున్న అనేక ఉదంతాలు ఇటీవల వెలుగుచూశాయి. అలాంటి వారిని కట్టడి చేసేందుకు వినూత్న ఆలోచన చేసింది కర్ణాటక ప్రభుత్వం. ప్రతి రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు.. గంటకొకటి చొప్పున సెల్ఫీ పంపాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 'క్వారంటైన్ వాచ్' యాప్ను ఉపయోగించాలని సూచించింది.
క్వారంటైన్ వాచ్ యాప్ ద్వారా తీసే ఫొటోలకు జీపీఎస్ కో-ఆర్డినేట్స్ జత అయ్యేలా ఏర్పాట్లు చేసింది కర్ణాటక సర్కార్. వాటి ద్వారా అనుమానితులు ఇల్లు దాటి బయటకు వస్తే గుర్తించనుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే... స్వీయ నిర్బంధానికి బదులు 14 రోజులు ప్రభుత్వ నిర్బంధ కేంద్రానికి పంపుతామని హెచ్చరించింది.
ఇదీ చదవండి: దేశంలో కరోనా తీవ్రరూపం- మరో ముగ్గురు బలి