అసలే వర్షాకాలం... రోడ్లన్నీ గుంతలమయం.. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరవయ్యారు. అలాంటి స్థితిలో మనమైతే ఏం చేస్తాం.. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టేవరకు ఆ గతుకుల రోడ్లపైనే కుదుపులకు లోనవుతూ ఎలాగోలా సర్దుకొని ప్రయాణం చేస్తాం..
కానీ.. కర్ణాటక బెంగుళూరుకు చెందిన ప్రముఖ త్రీడీ కళాకారుడు బాదల్ నంజుందాస్వామి... పాడైన రోడ్డును వినూత్నంగా ఉపయోగించుకున్నాడు. నిరసన వ్యక్తం చేసేందుకు భూమిపైనే అంతరిక్షాన్ని సృష్టించాడు.
నంజుందాకు మద్దతుగా నిలిచాడు కన్నడ యువ హీరో పూర్ణచంద్ర. వ్యోమగామిలా దుస్తులు ధరించి అంతరిక్షంలోని వేరే గ్రహంపై నడిచినట్లుగా నటించాడు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో చిత్రీకరించాడు. ప్రస్తుతం.. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
నెటిజన్ల ప్రశంసలు...
నంజుందా అద్భుత ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు. అధికారులపై నిరసన వ్యక్తం చేసేందుకు సరైన ఆలోచన అని మెచ్చుకున్నారు. తనవంతు సహకారం అందించినందుకు యువహీరో పూర్ణపై ప్రశంసల వర్షం కురిపించారు.
గతంలోనూ తన 3-డీ కళాఖండాలతో వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు నంజుందా. 2015లో బెంగళూరులోని ఓ రోడ్డుపై 12 అడుగుల గుంతను త్రీడీ ప్రతిభతో మొసలిలా మార్చి వెలుగులోకి వచ్చాడు.