2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం సవాలే అయినా... ఆచరణ సాధ్యమేనని ధీమా వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఇందుకోసం రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
దిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రసంగించారు మోదీ. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' మంత్రాన్ని సంపూర్ణం చేసేందుకు నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం, అవినీతిపై అందరూ సమష్టిగా పోరాడాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు మోదీ.
"ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల హడావుడి ముగిసింది. దేశాభివృద్ధి కోసం పని చేసే సమయం ఇది. అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగి సమస్యలను అధిగమించాలి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఆదాయం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఎగుమతుల రంగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు ప్రధాని. అన్ని రాష్ట్రాలు ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు.
'కరవు'పై మంతనాలు...
దేశంలో ఎన్నో ప్రాంతాలు కరవుతో సతమతం అవుతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ భేటీలో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రధాని. కరవును ఎదుర్కొనేందుకు 'పర్ డ్రాప్- మోర్ క్రాప్' వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రులకు సూచించారు.
నీటి సంరక్షణ, నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని మోదీ స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్తగా ఏర్పాటైన జల శక్తి మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.
వారు మినహా...
నీతి ఆయోగ్ భేటీకి బంగాల్, తెలంగాణ ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో పంజాబ్ సీఎం రాలేదు. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్ హాజరయ్యారు.
ఇదీ చూడండి:- పాకిస్థానీ ఫ్యాన్‌కు ధోని టికెట్లు పంపేది అందుకే!