కేరళ పాఠశాలలు, కళాశాలల్లో సమ్మెలు ఇక సాగవ్. అవును... అక్కడ విద్యాసంస్థల్లో సమ్మెలపై నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించింది కేరళ హైకోర్టు. 'కాలేజీలు ఉన్నది చదువుకోసమే కానీ.. సమ్మెల కోసం కాదని' స్పష్టం చేస్తూ వైవిధ్యమైన తీర్పు ప్రకటించింది.
క్యాంపస్ రాజకీయాలకు వ్యతిరేకంగా 20 విద్యాసంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. సమ్మెల వల్ల క్యాంపస్ కార్యక్రమాలకు విఘాతం కలగకూడదని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.
''సమ్మెల వల్ల క్యాంపస్ కార్యక్రమాలకు విఘాతం కలగకూడదు. కాలేజీలు ఉన్నది చదువుకునేందుకు మాత్రమే. సమ్మెల కోసం కాదు. క్యాంపస్లలో ఎలాంటి ర్యాలీలు, ఘోరావ్లు జరపరాదు. సమ్మెలకు ఎవరినీ ప్రోత్సహించరాదు.''
- జస్టిస్ పీబీ సురేష్ కుమార్
అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. ఇతర హక్కులకు భంగం కలిగించకూడదని పేర్కొంది. కళాశాల అనేది... శాంతియుత చర్చలు, ఆలోచనలకు వేదిక కావాలని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది కోర్టు. న్యాయస్థానం ఉత్తర్వులకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.