రాష్ట్ర పోలీసు చట్ట సవరణపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సవరణపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ అమలును నిలిపివేసింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినందున ఇలా చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
"కేరళ పోలీసు చట్ట సవరణను అమలు చేయాలని అనుకోవడం లేదు. ఈ విషయంపై రాష్ట్ర అసెంబ్లీలో సవివరమైన చర్చ నిర్వహిస్తాం. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం."
-పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు చేసినవారికి ఐదేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటన స్వేచ్ఛకు ఈ చట్టం విఘాతం కలిగిస్తుందని విమర్శించాయి.
ఇదీ చదవండి- కిరణ్ యుద్ధ విమానాల స్థానంలో స్వదేశీ జెట్లు