శబరిమల ఆలయానికి అనుమతిస్తున్న యాత్రికుల సంఖ్యను రోజుకు 5 వేలకు పెంచాలని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నతస్థాయి కమిటీ సూచించిన మార్గదర్శకాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న కేరళ సర్కారు భక్తుల సంఖ్యను 5 వేలకు పెంచితే కరోనా విజృంభించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్20 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు శబరిమలలో భక్తుల అనుమతిపై కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటిని ఏర్పాటు చేసినట్లు పిటిషన్లో పేర్కొంది. ఈ కమిటీ రోజుకు 2 వేల మంది భక్తులకు మాత్రమే ఆలయ దర్శనం కల్పించాలని సూచించింది. వారాంతాల్లో 3 వేల మందికి ఆలయ ప్రవేశం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ మార్గదర్శకాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో కేరళ సర్కారు పేర్కొంది.
శబరిమల ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ కొవిడ్ బారిన పడిన పోలీసులు, ఆరోగ్య సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉందన్న కేరళ ప్రభుత్వం యాత్రికుల సంఖ్య పెంచితే కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.