కేరళలోని త్రిస్సూర్‌లో ఏటా పూరమ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేల సంఖ్యలో ప్రజల మధ్య విభిన్న సంగీత వాద్యాలు వాయిస్తూ, డప్పు చప్పుళ్లతో(పూర మేళమ్) ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 58 ఏళ్లలో తొలిసారి ఈ ఏడు పూరమ్ ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. అదీ కొద్ది మంది ప్రజల నడుమ..!
కేవలం త్రిస్సూర్ వాసులకే కాస్తోకూస్తో ఈ పుర మేళా అనుభూతి కలిగింది. ఈ నేపథ్యంలోనే వేడుకలను ప్రత్యక్షంగా తిలకించినట్లుగా ఉండే అనుభూతి అందరికీ కల్పించాలనుకున్నాడో దంత వైద్యుడు. అంతే తనలోని ప్రతిభను బయటకుతీశాడు. తన కళకు పదునుపెట్టి.. ఉత్సవాల్లో వినిపించే సంగీతాన్ని తిరిగి సృష్టించాడు. వాద్యాల శబ్ధాలను పునఃసృష్టించేందుకు తీవ్రంగా శ్రమించాడు డా.జిమిలి జార్జ్. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇంటివద్దే అన్నీ సమకూర్చుకొని...
కరోనా లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న జార్జ్‌కు.. సంగీతంతో ప్రయోగం చేసేందుకు కావాల్సినంత సమయం దొరికింది. ముందునుంచీ సంగీతప్రియుడైన ఏదైనా చేయాలని అనుకున్నదే తడవుగా పూరమ్ ఉత్సవాల్లో వినిపించే మ్యూజిక్‌ను.. అచ్చం అలాగే పునఃసృష్టి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తన ఇంటినే వేదికగా చేసుకున్నాడు.
పూర మేళంలో చెందా, వలంతల, కుజాల్, ఇలతలమ్ వంటి వాద్యాలను ఉపయోగిస్తారు. అయితే.. అన్ని రకాల సంగీత పరికరాలు అందుబాటులో లేనందున.. ఇంట్లోనే అన్నీ సమకూర్చుకున్నాడు. పనస చెక్కతో చేసిన స్టూలును చెందాగా, వలంతల వలే బేస్ ఎఫెక్ట్‌గా స్పీకర్ బాక్సు, కజుల్ మాదిరిగా శబ్ధం వచ్చే ఆఫ్రికన్ కాజూను వినియోగించాడు జార్జ్. మేళానికి తప్పక అవసరమైన ఇలతలమ్ను తన స్నేహితుడి దగ్గర తెచ్చుకున్నాడు. వీటికి తోడు.. తనలో మిమిక్రీ నైపుణ్యం ఎలాగూ ఉండనే ఉంది.
ఒక్కో వాద్యాన్ని వేర్వేరుగా వాయించిన అనంతరం.. వాటి వీడియో, ఆడియోలను మిక్స్ చేశాడు. పూర మేళమ్లో వచ్చే శబ్ధాన్ని తిరిగి సృష్టించగలిగాడు. సౌండ్ మిక్సింగ్ సొంతంగా చేయగా.. జాయ్ సెన్ అనే వ్యక్తి వీడియో ఎడిటింగ్ చేశాడు.
తొలిసారేం కాదు..
డా. జమిల్ జార్జ్ ఇదొక్కటే కాదు ఇంతకు ముందు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాడు. మలయాళం సినిమా అయ్యప్పనమ్ కొశియమ్లో నాంచియమ్మ పాడిన పాటను పునఃసృష్టి చేసే ప్రయత్నం చేశాడు.