అరవింద్ కేజ్రీవాల్... దేశంలోని కీలక నేతల్లో ఒకరు. దిల్లీ ప్రభుత్వం తీసుకునే సంచలన నిర్ణయాలతో, ప్రత్యర్థులపై విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే మనిషి. ఇప్పుడు దిల్లీ శాసనసభకు ఎన్నికలు సమీపించిన వేళ... దేశ రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశమయ్యారు కేజ్రీవాల్.
ప్రస్తుతం క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు అరవింద్. దిల్లీ ఎన్నికల్లో మరోమారు ఆమ్ ఆద్మీ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు, బహిరంగ సభలు, మోదీ-షా ధ్వయంపై వాగ్బాణాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
బిజీబిజీగా గడుపుతున్న కేజ్రీవాల్‌కు ఆయన సతీమణి సునీత, కుమార్తె హర్షిత అండగా నిలుస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సొంత నియోజకవర్గం(న్యూ దిల్లీ)లో ప్రచారం చేస్తూ ఆప్‌కు ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వేర్వేరు అంశాలు పంచుకున్నారు.
భర్త కోసం...
రాజకీయ జీవితంలో కేజ్రీవాల్‌కు సాయంగా నిలిచేందుకు తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు సునీత. ఒకప్పుడు ఆమె ఐఆర్ఎస్ అధికారి.
తండ్రి తరఫున ప్రచారం నిర్వహించడం కోసం ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టారు హర్షిత. కేజ్రీవాల్‌కు అపూర్వ ప్రజాదరణ లభిస్తోందని చెప్పారామె. అప్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అన్ని వర్గాలను సంతోషపరుస్తుండటమే ఇందుకు కారణమన్నారు.
ప్రజల నుంచి వస్తున్న సానుకూలత ఎంతో ఉత్తేజపరుస్తున్నప్పటికీ... పని భారం వల్ల కేజ్రీవాల్ ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు సునీత.
"సమాజం కోసం పనిచేయాలని నిశ్చయించుకున్నట్టు పెళ్లి సమయంలోనే కేజ్రీవాల్ నాకు చెప్పారు. అవినీత వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని ఎన్నడూ ఊహించలేదు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అనంతరం సీఎం పదవిని చేపట్టారు."
--- సునీత, కేజ్రీవాల్ సతీమణి.
అందుకే సీఎంపై దుష్ప్రచారం...
దిల్లీ అభివృద్ధి కోసం భాజపా వద్ద సరైన ప్రణాళికలు లేకపపోవడం వల్లే ముఖ్యమంత్రిపై దుష్ప్రచారం చేస్తూన్నారని మండిపడ్డారు సునీత. సమాజం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తిపై అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదన్నారు.
ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారు కూడా తమ సీఎంపై ఇలాంటి పదజాలం ప్రయోగించడాన్ని చూసి బాధపడుతూ ఉంటారని పేర్కొన్నారు హర్షిత.
ఇదీ చూడండి:- దిల్లీ దంగల్: 'రాష్ట్ర హోదా'పై రాజకీయ రగడ