దిల్లీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ప్రమాణస్వీకార మహోత్సవానికి దిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానం సన్నద్ధమైంది. పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రామ్‌లీలా మైదానానికి చేరుకునే దారులన్నీ.. 'ధన్యవాదాలు దిల్లీ' బ్యానర్లతో కిటకిటలాడుతున్నాయి.
దిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో దిల్లీ పోలీసులు భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. 2వేల నుంచి 3వేల వరకు భద్రతా సిబ్బంది, పారామిలిటరీ దళాలను దిల్లీలో మోహరించారు. డ్రోన్లను కూడా వినియోగించనున్నారు.
ప్రజల మధ్యే ప్రమాణం...
ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మినహా ప్రముఖులను అహ్వానించలేదు ఆప్. తన నాయకత్వంపై విశ్వాసం ఉంచిన దిల్లీ ప్రజల మధ్యే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఇప్పటికే పార్టీ స్పష్టం చేసింది.
'దిల్లీ నిర్మాణ్' కార్యక్రమంలో భాగమైన వివిధ వర్గాలకు చెందిన 50 మంది వ్యక్తులు వేదికపై ఆసీనులు కానున్నారని వెల్లడించారు పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా. ఈ 50 మందిలో ఉపాధ్యాయులు, బస్ మార్షల్స్, చారిత్రక బ్రిడ్జిని నిర్మించిన ఆర్కిటెక్టులు, అగ్నిప్రమాద ఘటనల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబ సభ్యులు.. వంటి విభిన్న నేపథ్యం కలవారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
అయితే... అచ్చం కేజ్రీవాల్ లాగా దుస్తులు ధరించి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన బుల్లి 'మఫ్లర్ మ్యాన్' ఆవ్యన్ తోమర్.. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అథితిగా విచ్చేయనున్నాడు.
కేజ్రీతో పాటు...
నేడు కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియా సహా సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, ఖలాశ్, గహ్లెత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. 70 నియోజకవర్గాలకు గానూ 62 స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా 8 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
ఇదీ చూడండి- నో టైం: ఆఫీస్‌లో పెళ్లిచేసుకున్న అధికారులు