భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్.. ఈ నెల 25న దిల్లీ మోతీ బాఘ్‌లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖుల జాబితా నుంచి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్లు తొలగించారన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
నిజానికి మెలానియా ట్రంప్‌తో పాటు కేజ్రీవాల్, సిసోడియా కూడా పాఠశాలకు వెళ్లాల్సి ఉంది. ఆ బడి ప్రత్యేకతలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'హ్యాపీ' పాఠ్య ప్రణాళికను ఆమెకు వివరించాల్సి ఉంది.
ఈ విషయంపై అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని సంప్రదించగా... స్పష్టతనివ్వాలని ఆయన దిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. కానీ దిల్లీ ప్రభుత్వం నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు.
ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం.. డొనాల్డ్ ట్రంప్ బృందం అహ్మదాబాద్‌కు చేరుకోనుంది. అక్కడ రోడ్ షో, నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కుటుంబ సమేతంగా ఆయన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అనంతరం దిల్లీ వెళ్తారు.
ఇదీ చూడండి:- తాజ్‌మహల్‌కు ట్రంప్‌తో మోదీ వెళ్లరట!