దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వింత అనుభవం ఎదురైంది. నేడు నామినేషన్ వేయాల్సి ఉండగా.. వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. శాసనసభ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న క్రమంలో ప్రచారంలో వేగం పెంచిన ముఖ్యమంత్రి.. నేడు భారీ రోడ్ షో నిర్వహించటమే ఇందుకు కారణం. ప్రచార ర్యాలీలో పాల్గొన్న తరుణంలో నామినేషన్ సమయం ముగిసిపోయింది.
దీంతో చేసేదేమీ లేక మంగళవారం(రేపు) నామపత్రాలు దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు కేజ్రీవాల్. కుటుంబ సమేతంగా వచ్చి పత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. అయితే.. మంగళవారమే నామినేషన్‌కు చివరి రోజు కావటం గమనార్హం.
"ఈరోజే నామినేషన్ సమర్పించాల్సి ఉంది. కానీ నామినేషన్ దాఖలు చేసే కార్యాలయం మధ్యాహ్నం 3 గంటలకే మూసేయడం జరుగుతుంది. రోడ్ షో మధ్యలో వెళ్లి నామపత్రాలు దాఖలు చేయాలని నాకు సూచించారు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రజలను వదిలి నేను ఎలా నామినేషన్ వేయగలను? నా కుటుంబంతో కలిసి రేపు నామినేషన్ సమర్పిస్తా."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.
భారీ రోడ్ షో
చారిత్రక వాల్మీకి మందిరంలో ఆమ్ ఆద్మీ నేతలు పూజలు నిర్వహించిన అనంతరం రోడ్ షో ప్రారంభించారు కేజ్రీవాల్. అక్కడి నుంచి కన్నాట్ ప్లేస్, బాబా ఖారక్ సింగ్ మార్గ్ మీదుగా పటేల్ చౌక్ వరకు రోడ్ షో కొనసాగింది.
పార్టీ గుర్తు అయిన చీపుర్లను చేతపట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్ షోలో పాల్గొన్నారు. 5 సంవత్సరాల పాలన అద్భుతంగా సాగిందంటూ నినాదాలు చేశారు. కేజ్రీవాల్‌తో పాటు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ నేతలు సంజయ్ సింగ్, గోపాల్ రాయ్‌లు ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పార్టీ అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేద్దాం: నడ్డా