కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో ఆ రాష్ట్రానికి చెందిన యువతులు ఇతర రాష్ట్రాల యువకులను వివాహమాడేందుకు మార్గం సుగమం అయ్యింది. ఓ కశ్మీరీ యువతి.. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని పరిణయమాడింది. మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం తర్వాత ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఓ కశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన అక్షయ్ కొంతకాలం ముందు దిల్లీలో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో కశ్మీర్ యువతి కామిని రాజ్‌పుత్.. దిల్లీలోని తన అత్త నివాసంలో కొన్ని రోజులు గడిపింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అక్షయ్- కామిని పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికి కశ్మీర్‌కు ఉన్న పత్యేక ప్రతిపత్తి కారణంగా ఆ రాష్ట్ర యువతులు వేరే రాష్ట్రానికి చెందిన యవకులను పెళ్లి చేసుకోవడం కష్టంగా ఉండేది. యువత వారికున్న ప్రత్యేక హక్కులను కోల్పోయేవారు.
ఆర్టికల్ 370 రద్దుతో అడ్డు తొలగిపోయింది. సామాజిక వర్గాలు వేరైనా... ఇద్దరు తమ కుటుంబాలను పెళ్లికి ఒప్పించారు.
"మా వివాహం బాగా జరిగింది. అందరం సంతోషంగా ఉన్నాం. కశ్మీర్లో అందరికీ సమాన హక్కులు ఉండేలా మార్పు వచ్చింది. మా కుటుంబ నేపథ్యాలు వేరు. దిల్లీలో మా ప్రేమ మొదలైంది."
-అక్షయ్ కుక్కడ్, రాజస్థాన్.
అంతర్రాష్ట్ర ప్రత్యేక చట్టం కింద విహవాం
అక్షయ్ ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి శ్రీగంగానగర్‌లో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. అంతర్ రాష్ట్ర ప్రత్యేక చట్టం కింద కామిని- అక్షయ్ విహహం జరిగింది. ఈ పెళ్లికి జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. తమ కల నెరవేరినందుకు అక్షయ్-కామినిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరి వివాహ విందు వేడుకను అక్టోబరులో ఘనంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. జమ్ముకశ్మీర్ నుంచి వచ్చే బంధువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ఇదీ చూడండి: కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?