జమ్ముకశ్మీర్‌లో వరుసగా మూడో రోజూ బంద్ కొనసాగింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అయితే ప్రస్తుతం లోయలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రధాన మార్కెట్లు బంద్
నగరాల్లోని, లోయలోని చాలా ప్రాంతాల్లోని ప్రధాన మార్కెట్లు ఇప్పటికీ మూసివేసే ఉన్నాయి. ప్రజారవాణా కూడా చాలా తక్కువగా ఉంది. ప్రైవేటు వాహనాల రాకపోకలు సాధారణంగా చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని ఆటోరిక్షాలు, స్థానికంగా తిరిగే క్యాబ్‌లు మాత్రమే నడుస్తున్నాయి.
వరుసగా 16వ వారం
కశ్మీర్‌లోని ప్రసిద్ధ జామియా మసీదు వరుసగా 16వ శుక్రవారం కూడా మూసివేశారు. ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగిస్తూ ఆర్టికల్ 370 రద్దుచేయడం, అలాగే రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి మసీదును ప్రతి శుక్రవారం మూసివేస్తున్నారు.
మసీదులో ప్రార్థనలను అవకాశంగా తీసుకుని వేర్పాటువాదశక్తులు.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
హెచ్చరికలు
ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. వాటిని క్రమంగా సడలిస్తూ వస్తున్నారు. కొద్దివారాలుగా కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అందరూ భావిస్తుండగా... కొందరు నిరసనకారులు బంద్‌కు పిలుపునిచ్చారు.
బుధవారం ప్రజలను బెదిరిస్తూ లోయలో అనేక చోట్ల గోడపత్రికలు కనిపించాయని అధికారులు తెలిపారు. వీటిలో దుకాణదారులు తమ షాపులు తెరవకూడదని, వాహనదారులు తమ వాహనాలను ప్రజా రవాణాకు వినియోగించరాదని హెచ్చరికలు ఉన్నట్లు వెల్లడించారు. కశ్మీర్లో ప్రజల జీవితంగా సాధారణ స్థితికి చేరుకుంటుందన్న భావనకు ఇది గొడ్డలిపెట్టని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: గాల్లో ఉండగానే విమానంలో మంటలు- తృటిలో తప్పిన ముప్పు